- ఇండియన్ రేసింగ్ లీగ్ లో తలపడనున్న ఎనిమిది జట్లు
- బాలీవుడ్ సెలెబ్రిటీలు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం మరియు క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ సరసన చేరనున్న నాగచైతన్య
మాములుగా ఓ కారు రోడ్డుపై 100 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్తుంటే మనం అవాక్కై చూస్తాం. అలాంటిది రేస్ సర్క్యూట్ లో రేసింగ్ కార్లు టాప్ స్పీడుతో వెళ్ళడం చూస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇలాంటి థ్రిల్లింగ్ రేస్ ని మనకు అందించడానికి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్-2024 మన ముందుకు వచ్చింది. దీనిని ఎఫ్ఐఎ ఫార్ములా4 ఇండియన్ ఛాంపియన్ షిప్ మరియు ఇండియన్ రేసింగ్ లీగ్ సంయుక్తంగా నిర్వహించనున్నాయి అందులో మన హైదరాబాద్ జట్టు బ్లాక్ బర్డ్స్ అనే పేరుతో ఈ లీగ్ లో పాల్గొంటుంది. అయితే, బ్లాక్ బర్డ్స్ జట్టుకు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య యజమానిగా వ్యవహరిస్తున్నాడు. మద్రాస్ ఇంటర్నేషనల్ సర్కూట్ వేదికగా జరగనున్న ఈ లీగ్ ఆగస్టు 24న ఆరంభంకానుండగా, ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో పాల్గొనే జట్లు
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ గురించి చెప్పాలంటే, మొదటగా ఇది 2022 డిసెంబరులో ప్రారంభమవగా, ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొనగా, అందులో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, స్పీడ్ డెమాన్స్ ఢిల్లీ, బెంగళూరు స్పీడ్‌స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గాడ్‌స్పీడ్ కొచ్చి మరియు గోవా ఏసెస్ ఉన్నాయి. 2022లో జరిగిన రేసులో గాడ్‌స్పీడ్ కొచ్చి జట్టు టైటిల్ ని ఎగరేసుకుపోయింది. ఈ సారి పైన పేర్కొన్న జట్లతో పాటు అదనంగా కోల్ కతా రాయల్ టైగర్స్ మరియు అహ్మదాబాద్ అనే మరో రెండు జట్లు పాల్గొంటున్నాయి, చూడాలి మరి, ఈ సారి ఏ జట్టు టైటిల్ నెగ్గుతుందో.
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో సెలెబ్రిటీలు
రేసింగ్ లీగ్ లో మొదటిసారిగా అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టుకు యజమానిగా వ్యవహరించనున్నాడు. అలాగే, గోవా ఏసెస్ జట్టుకు బాలీవుడు నటుడు జాన్ అబ్రహం, స్పీడ్ డెమాన్స్ ఢిల్లీ జట్టుకు నటుడు అర్జున్ కపూర్, మరియు కోల్ కతా రాయల్ టైగర్స్ జట్టుకు ఇండియన్ క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ యజమానులుగా వ్యవహరించనున్నారు.
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ గురించి సినీ హీరో నాగచైతన్య మాట్లాడుతూ “నేను లైఫ్ లాంగ్ ఫార్ములా 1 ఫ్యాన్ గా ఉండిపోతాను. ఎందుకంటే, నాకు చిన్నప్పటినుంచి రేసింగ్ కార్లంటే చెప్పలేనంత ఇష్టం. హై-స్పీడ్ తో సూపర్ కార్లు మరియు బైక్‌లను నడపడం నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ అనేది కేవలం పోటీ మాత్రమే కాదు, దీనిపై నాకు ఎంత మక్కువ ఉందో చాటుకోవడానికి సరైన వేదిక. ఈ సీజన్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్‌కు నాయకత్వం వహించడం అనేది నాకు ఎంతో అనుభవాన్నిఅందిస్తుందని భావిస్తున్నాను. ఈ మరచిపోలేని ఫీలింగ్ ని అభిమానులకు అందిస్తూ, ఇండియన్ మోటార్‌స్పోర్ట్స్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లాలని, రేసింగ్‌లోని రేసింగ్ టాలెంట్ ద్వారా తర్వాతి జనరేషన్ వారిలో స్ఫూర్తి నింపేందుకు నా వంతు కృషి చేయడానికి ఎంతో ఆత్రుతగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు.
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నిర్వహించు తేదీలు:
రౌండ్ | తేదీలు | వేదిక |
రౌండ్-1 | ఆగస్టు – 24, 25 | మద్రాస్ ఇంటర్నేషనల్ సర్కూట్ |
రౌండ్-2 | 31 ఆగస్టు, 01 సెప్టెంబర్ | మద్రాస్ ఇంటర్నేషనల్ సర్కూట్ |
రౌండ్-3 | 13, 14, 15 సెప్టెంబర్ | కారి మోటార్ స్పీడ్ వే రేస్ ట్రాక్ |
రౌండ్-4 | 19, 20 అక్టోబర్ | ప్రకటించాల్సి ఉంది |
రౌండ్-5 | 16, 17 నవంబర్ | ప్రకటించాల్సి ఉంది |